ఆంధ్ర ప్రభ
ఉమ్మడి సర్వీస్ రూల్స్ తోనే విద్యా వ్యవస్థ బాగుపడుతుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు కె . వెంకటేశ్వరరావు , జి . హృదయరాజు పేర్కొన్నారు . పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడేవు చినవీరభద్రుడు ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయుల సంఘాలు , ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘాలతో ఉమ్మడి సర్వీస్ రూల్స్ అంశంపై విజయవాడలో శుక్రవారం సమావేశం జరిగింది . ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు , హృదయరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అతిపెద్ద విద్యాశాఖలో ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ లేకపోవడంతో పర్యవేక్షణ ఉప విద్యాధికారులు 58 మందిలో ఒక్కరే రెగ్యులర్ గా ఉన్నామన్నారు . 40 శాతం ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయని , డైట్ , ఐఏఎస్ఈ , ఎస్సీఈఆర్టీలలో 90శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు . దీంతో విద్యావ్యవస్థ కుదేలవుతుందన్నారు . అదేవిధంగా వేలాది మంది టీచర్లు నియామకమైన పోస్టుల్లోనే పదవీ విరమణ పొందుతున్నారన్నారు . కమిషన్ చొరవచూపి ఒక పరిష్కార మార్గం చూపాలని కోరారు . దీనిపై కమిషనర్ మాట్లాడుతూ సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి , ముఖ్య కార్యదర్శి బి . రాజశేఖర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు సానుకూలమైన పరిష్కార మార్గాన్ని చూపుతామని హామీ ఇచ్చారు .