
మరి కొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి పార్లమెంట్ స్థానానికి, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల తతంగం ప్రారంభం కాబోతోంది, ఎన్నికల విధుల్లో భాగంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధ్యాయులు ( 90% ), ఉద్యోగులు బ్రతుకు పోరులో జీవితాలను బలి పెట్టబోతున్నారు. ఇది ఆత్మహత్యా సదృశ్యం. వాటిల్లే నష్టం ప్రభుత్వాల స్వయకృతాపరాధం. దేశవ్యాప్తంగా కరోనా విలయం అరుస్తు0డగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనుసన్నల్లో నడిచే ఎన్నికల కమీషన్లు ప్రజలు, ఉద్యోగుల భద్రతను పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమయ్యాయి. అయినా మేము ఒక్కమాట సూటిగా అడగదల్చుకున్నాం, దేశ పార్లమెంటులో 543 స్థానాల్లో ఒక్క స్థానం కొంతకాలం ఖాళీగా ఉంటే వచ్చే నష్టమేంటి? ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఏళ్ళ తరబడి సుప్తచేతనావస్థలో పెట్టినప్పుడు ఏమైంది ఈ రాజనీతిజ్ఞత. పాలనలో అనేక అంచెల వికేంద్రీకరణ వ్యవస్థలుండగా పార్లమెంటు ఒక సభ్యుడు లేకపోవడం వల్ల ప్రజలకు ఒరిగే నష్టమెంత? భర్తీ అయితే ఒనగూరే ప్రయోజనమెంత? ఈ ఎన్నికల పర్యవసానంగా ప్రస్తుత కరోనాలో అపశృతి దొర్లితే పోయే ప్రాణాలకు ఎవరు హామీ? దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది కరోనా బారిన పడుతున్నారు. వైద్యశాలల్లో బెడ్లు, మందులు కరువై, కనీసం ఆక్సిజన్ లభించక విలవిలలాడుతున్నారు. శవాలను దాచి మార్చురీలు లేక దేశంలోని అనేక ప్రాంతాల్లో కుళ్లుతున్నాయి. అంత్యక్రియలు నిర్వహించడానికి అవకాశాలు లేక ప్రాణాలు కోల్పోయిన మనుషులు ప్రాణాలున్న మనుషుల మధ్య గుట్టలుగా పడివున్నారు. గుండెలు పిండేసే హృదయ విధారక దృశ్యాలు దేశమంతటా కన్నీటిని తెప్పిస్తుంటే కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి అత్యంత పాశవికంగా ఉంది. సామాజిక దూరం పాటించమంటున్న యంత్రాంగం జనాన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా గుట్టలు చేస్తుండడం దేనికి సంకేతం. మరి కొన్ని జీవితాలను కరోనాకు అప్పగించడమే ప్రభుత్వం లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక ప్రాణం పోతే దాని లోటెంత? ఆ కుటుంబం కోల్పోయేదెంత? మూల్యం చెల్లించుకోబోయేది ఉపాధ్యాయులే! నిజానికి ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయుల రక్షణకు కనీస భద్రతా నియమాలు పాటించిన దాఖలాలు లేవు. 12 గంటల పాటు నిర్విరామంగా స్వీయ భద్రతతో విధులు నిర్వర్తించాల్సిందేనని హుకుం జారీ చేయడం భూస్వామ్య సంస్కృతిని ప్రతిభింబింపజేయడం కాదా?. ఎన్నికల విధులు నిర్వర్తించడానికి రెండు గంటలు ముందు మరో రెండు మూడు గంటలు తర్వాత సన్నద్ధతకు వెరసి 15 గంటల మానసిక, శారీరక వత్తిడితో విధులు నిర్వర్తించవలసిరావడం బహుశా గడిచిన ఏడు దశాబ్దాల భారత ప్రజాస్వామ్య ఎన్నికల చరిత్రలో ఇదే ప్రధమం కావచ్చు. ఇలా0టి ప్రత్యేక పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహం మార్చితే తప్పేంటి? ఉపాధ్యాయుల జీవితాలు గాలిలో దీపం కాబోతున్నాయి. ఇప్పటికే ఇంచుమించు రెందులక్షల ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పాపం! మంత్రులు, కొందరు పెద్దలు శ్రద్ధాంజలి ఘటిస్తే ఆయా కుటుంబాలు కొలుకుంటాయా? మరెందరో కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సందర్భాలెన్నో ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడుతూ మినహాయింపు కోరిన సందర్భాల్లో వారి వినతులు పట్టించుకునే వారు లేరు. ఏదిఏమైనా ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పోలింగ్ విధుల్లో పాల్గొనే ఇతర సిబ్బంది సంయమనంతో ఈ గడ్డు పరిస్థితులను అధిగమించి ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరాలని ఏపీటీఎఫ్ అభిలాషిస్తోంది.
మోహన్ దాస్
ఏపీటీఎఫ్ 1938